తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం ప్రజాస్వామ్యంపై దాడి!
- బీసీల రాజ్యాధికార ఉద్యమాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు
- టీ ఆర్ పీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : బీసీల రాజకీయ రాజ్యాధికారం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం(Political power, social justice, and self-respect) కోసం తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్రను(BC Political Empowerment Yatra) అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఆయన ప్రయాణిస్తున్న కారును లారీతో ఢీకొట్టిన ఘటన జరిగిందనే అనుమానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ అన్నారు. శని వారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి విగ్రహం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 51వ రోజు అనాస్పూర్–మోత్కూరు నుంచి తిరుమలగిరి వైపు కొనసాగుతున్న సమయంలో అనాస్పూర్ సమీపంలో అతివేగంగా వచ్చిన లారీ మల్లన్న ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రమాద సమయంలో మల్లన్న కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమైందన్నారు.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడగా, ఎదురుగా వస్తున్న కారులో ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒక మహిళ చికిత్స పొందుతూ మృతిచెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటం కలచివేస్తోందని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతిచెందిన మహిళ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బీసీల గొంతుకను అణచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉదృతం...
బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో సాగుతున్న రాజ్యాధికార యాత్రను భయపెట్టి ఆపాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని TRP జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమ హక్కుల కోసం ప్రశ్నించే, పోరాడే హక్కు ఉందని, అలాంటి ఉద్యమాలపై దాడులు, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.
గతంలో బెల్లి లలిత, మారోజు వీరన్న, సాంబశివుడు వంటి ఉద్యమకారుల హత్యలు తెలంగాణ సమాజాన్ని ఎంతగానో కలచివేశాయని గుర్తుచేశారు. ఉద్యమకారుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. 51 రోజులుగా కొనసాగుతున్న బీసీ రాజ్యాధికార యాత్రకు రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోందని, ఈ ఉద్యమం ద్వారా బీసీలు తమ హక్కులు, వాటా, అధికారంపై చైతన్యం పొందుతున్నారని తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు.
90 శాతానికి పైగా ఉన్న బహుజన సమాజం ఇక భయపడదు...!
అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బీసీ, బహుజన వర్గాలు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరని, బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేష్ వర్మ స్పష్టం చేశారు. బీసీల రాజ్యాధికార లక్ష్యం సాధించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా మా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
ఈ ప్రమాద ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు వెల్లడించాలని, ఘటన వెనుక కుట్ర కోణం ఉన్నట్లయితే దానిని వెలికితీసి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ రాజ్యాధికార యాత్రలో పాల్గొంటున్న నాయకులకు తక్షణమే పటిష్టమైన పోలీసు భద్రత కల్పించాలని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మృతిచెందిన కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి, అన్ని విధాలా అండగా నిలవాలని డిమాండ్ చేసారు.
బీసీల రాజ్యాధికార ఉద్యమం తరతరాలుగా రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడిన బహుజన వర్గాలకు న్యాయమైన వాటా, సమాన అవకాశాలు కల్పించాలనే ప్రజాస్వామ్య పోరాటమని, ఈ ఉద్యమాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపలేరని ... బీసీల రాజ్యాధికారం సాధించే వరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేసారు.