న్యాయ సేవలపై అవగాహన ర్యాలీ
ఉచిత న్యాయ సహాయం ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యం: జిల్లా జడ్జి మారగాని శ్రీనివాసరావు
కోర్టు నుంచి జేవీఆర్ డిగ్రీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ
సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవా దినోత్సవం (National Legal Services Day) వారోత్సవాల్లో భాగంగా సత్తుపల్లిలో న్యాయ విజ్ఞాన సదస్సు, అవగాహన ర్యాలీ(Sathupalli Legal Awareness Rally)ని ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన ర్యాలీని సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు జెండా ఊపి ప్రారంభించారని తెలిపారు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్కరూ న్యాయ సహాయానికి దూరం కాకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం(Free Legal Aid) అందించడమే న్యాయ సేవాధికార సంస్థల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు న్యాయ సేవాధికార సంస్థల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ(Sathupalli Mandal Legal Services Committee) నిర్వహించే విధులైన లోక్ అదాలత్‌లు, ప్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం, న్యాయ చైతన్య సదస్సులు, జైలు అదాలత్‌లు, ఉచిత న్యాయ సహాయం తదితర అంశాలపై కక్షిదారులకు అవగాహన కల్పించారు. అనంతరం సత్తుపల్లి కోర్టు నుంచి జేవీఆర్ డిగ్రీ కళాశాల వరకు న్యాయ సేవలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కె. మీరా ఖాసిం సాహెబ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.ఎస్.ఎన్. సుమబాల, సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రవి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సత్తుపల్లి మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.