కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా

18-11-2026 | 05:50am
  1. ప్రభుత్వ బీమా పథకాలన్నీ ఒకే గొడుగు కిందికి
  2. అధికారులకు సీఎం ఆదేశాలు
  3.    19న సిద్దిపేట సభలో బీమా దరఖాస్తుల ప్రారంభం
  4. ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా!

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా(Indiramma Insurance) అందాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తేల్చిచెప్పారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను(Insurance schemes) ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ నెల 19న సిద్దిపేట(Siddipet) బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణను(Acceptance of applications for the Indiramma insurance scheme) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై(Distribution of 'Indiramma' sarees) మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా అందనుంది. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతోపాటు లక్షలాది మంది పేదలు లబ్ధి పొందుతారని సీఎం తెలిపారు. ఇప్పటికే అమలవుతున్న వివిధ రకాల బీమా పథకాల్లో జీవిత బీమా కింద రూ. రెండు లక్షలు, ప్రమాద బీమా కింద రూ. పది లక్షల వరకు అందిస్తున్నట్లు ఆయనకు అధికారులు వివరించారు.

ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న అన్ని బీమా పథకాలను ఒకే గొడుగు కిందికి  తీసుకువచ్చి, వారికి లభిస్తున్న ప్రమాద బీమాను యథాతథంగా అందేలా చూడాలని సీఎం అన్నారు. కొన్ని శాఖల్లో ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల జీవిత బీమాను ఇందిరమ్మ బీమా పరిధిలోకి తీసుకువచ్చి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి బీమా భద్రత అందుకుంటున్న వారిలో ఏ ఒక్కరినీ కూడా తప్పించడానికి వీల్లేదని సీఎం తేల్చిచెప్పారు.

అర్హులైన మహిళలందరికీ చీరలు

సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందాలని సమీక్షా సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు. చీరలను తక్షణమే అన్ని జిల్లాలకు తరలించాలన్నారు. ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇందిరమ్మ బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. బీమా దరఖాస్తులను గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచా లన్నారు. సమీక్ష సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీఎంవో కార్యదర్శి మానిక్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు