విలీనం చేయాల్సిందే
విద్యాశాఖలో మోడల్ స్కూళ్ల విలీనానికి జేఏసీ పట్టు
డైరెక్టరేట్ ముట్టడికి ఉపాధ్యాయుల యత్నం
010 పద్దులో జీతాలు చెల్లించాలి
పెన్షన్, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): మోడల్ స్కూళ్లను(Model schools) పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని, ఉపాధ్యాయులకు(Teachers') 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయ జేఏసీ(Teachers' JAC for Model Schools) ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం(Directorate Office of the School Education Department) ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి బేగంపేట, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు నేతలు తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా నేటికీ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం లభించలేదన్నారు. ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు తమ కుటుంబాల భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణ, ఆర్థిక ప్రయోజనాల కోసం రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమన్నారు.
డెత్ గ్రాట్యుటీని వర్తింపజేయాలి : యాకమల్లు, కొండయ్య
తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ జేఏసీ నాయకులు భూతం యాకమల్లు, కొండయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగులకు గత ప్రభుత్వం మంజూరు చేసిన డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలను మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అందుకకు సంబంధించిన జీవో నెం.60ను అమలు చేయాలన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు వర్తించే ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలను మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కూడా వర్తింపజేస్తూ జీవో నెం.58ను అమలు చేయాలని కోరారు.
విధి నిర్వహణలో ఉండగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలు చేసి ఆరోగ్య కార్డులు అందించాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు విడతల డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, 317 జీవో ప్రకారం చేపట్టిన కేటాయింపుల ప్రక్రియను పూర్తిచేసి సంబంధిత ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొన్నారు.
మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1,080 పోస్టులను భర్తీ చేస్తూ అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తరాల జగదీష్, రాజు జాదవ్, వేణుగోపాల్ రెడ్డి, విటా రాము, ఎల్. అరవింద్ ఘోష్, నాగేష్, మహేష్, అశోక్ పాల్గొన్నారు.