వెంకటాపూర్‌లో కేవీకి భూమి పూజ
మందమర్రి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్(KV Electrical Substation) నిర్మాణానికి బుధ వారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్(Minister Gaddam Vivek) వెంకటస్వామి భూమి పూజ చేశారు. గ్రామ సర్పంచ్ సెగ్యం వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గడ్డం మాట్లాడుతూ.. వెంకటాపూర్ గ్రామ ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పలు పనులకు శాంక్షన్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామంలోని చెరువులకు సంబంధించిన తూములు, కాలువల మరమ్మతు పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాద మృతులకు నివాళి...
ఇటీవల నస్పూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సతీష్, ఎంపీడీఓ రాజేశ్వర్, విద్యుత్ శాఖ ఎస్సీ, డీఈ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కడారి జీవన్ కుమార్, జిల్లా జనరల్ సెక్రటరీ నీలయ్య, వెంకటాపూర్ ఉప సర్పంచ్ సిద్ధుల రాజేశ్వరి, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.