ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి
ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీ ధనపనేని వెంకటేశ్వర్లు
ములుగు: దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కు, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, పారదర్శకమైన ఓటర్ల జాబితా అంశాలపై సమాధానాలు కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఈ అక్రమ చర్యలు ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది అని ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీ ధనపనేని వెంకటేశ్వర్లు(Dhanapaneni Venkateshwarlu) అన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు స్పష్టమైన సమాచారం, రికార్డులు, పారదర్శకమైన వివరణలతో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నలు అడిగిన వారిని అణచివేయడం కంటే, ప్రజలకు అనుమానం కలిగించే అంశాలపై బహిరంగంగా వివరణ ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మరింత మేలు చేస్తుందన్నారు.
ఓటు అనేది కేవలం ఒక బటన్ నొక్కడం కాదు—ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కు. ఆ ఓటు హక్కుకు సంబంధించిన ఓటర్ల జాబితా, తొలగింపులు, చేర్పులు, మార్పులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రతి అంశంలో పూర్తి పారదర్శకత ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం నేరం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా అరెస్టులు చేయడం ద్వారా ప్రజల సందేహాలు తొలగిపోవు. మరింత పెరుగుతాయి అని ధనపనేని వెంకటేశ్వర్లు అన్నారు.
ఎన్నికల వ్యవస్థపై ఎవరైనా ఆరోపణలు చేస్తే వాటిని స్వతంత్రంగా పరిశీలించి, వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచాలని, కొత్త ఓటర్ల నమోదు ఫాం లో ఏకపక్షంగా మార్పు, ఓటర్ల జాబితా లో కొన్ని వర్గాల వారి తొలగించడం వంటి ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. అదే సమయంలో, ఎన్నికల సంఘంపై వచ్చిన ప్రతి ఆరోపణను పత్రాలు, గణాంకాలు, అధికారిక రికార్డుల ఆధారంగా నిజానిజాలను తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
“ ఓటు హక్కు కోసం ప్రశ్నించే గొంతును ఆపలేరు”
దేశంలో ఎన్నికలు ప్రజల విశ్వాసంతోనే బలపడతాయని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ధనపనేని వెంకటేశ్వర్లు అన్నారు, ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం, ఎన్నికల వ్యవస్థపై వివరణలు కోరడం, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగబద్ధమైన పౌర హక్కుల పరిధిలోని అంశాలని ఆయన పేర్కొన్నారు.