గొర్రెల కాపరుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి

07-10-2026 | 05:08pm

- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు డాక్టర్ శ్రీహరి, ప్రభాకర్ కురుమ వినతి

- పశువైద్య మందులు, టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

నారాయణఖేడ్, అక్టోబర్ 7: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌(Talasani Srinivas Yadav)ను కురుమ సంఘం నాయకులు కోరారు.

హైదరాబాద్‌లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరితో కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గ కురుమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ కురుమ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గొర్రెల కాపరుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలకు అవసరమైన పశువైద్య మందులు, టీకాలు సకాలంలో అందడం లేదని, పశువైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గొర్రెల పెంపకందారుల జీవనోపాధికి సంబంధించిన సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. గొర్రెల కాపరుల హక్కులు, పశువైద్య సేవలకు సంబంధించిన అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు కృషి చేస్తానని, కురుమల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో గొర్రెల కాపరుల సహకార సంఘం మాజీ జిల్లా డైరెక్టర్ భూమన్న, రుద్రారం గ్రామ చైర్మన్ దశరథ్, కురుమ సంఘం యువత జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, బీసీ యువత అధ్యక్షుడు దత్తు, సిర్గాపూర్ మండల అధ్యక్షుడు సంతోష్, శశివర్ధన్‌తో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు