మూసీ భూసేకరణలో భూ యజమానులకు న్యాయం చేయాలి
కలెక్టర్‌తో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భేటీ.. 60:40 నిష్పత్తి అమలు చేయాలని విజ్ఞప్తి
ఉప్పల్ అక్టోబర్ 07 (విజయక్రాంతి): ముసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ అంశాలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Laxma Reddy) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ప్రాజెక్టు అమలులో భూ యజమానులు, రైతులు, బాధితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా జి .వో నెంబర్ 240 మేరకు ముసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఏరియాలో అమలవుతున్న ల్యాండ్ పూలింగ్ విధానంపై చర్చించారు. ప్రాజెక్టు పరిధిలో పటా, అసైన్డ్, ప్రభుత్వ భూములు, బఫర్ ఏరియా, రివర్‌బెడ్/ఎఫ్‌టీఎల్ ప్రాంతాలు ఉన్నందున ప్రతి భూ యజమానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రతాప్‌సింగారం ప్రాంతంలో గజానికి 1750 చదరపు అడుగుల అభివృద్ధి భూమి కేటాయిస్తున్న నేపథ్యంలో, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని భూ యజమానులకు కనీసం 1400 చదరపు అడుగుల అభివృద్ధి భూమి ఇవ్వాలని కోరారు. అలాగే 60:40 నిష్పత్తి ప్రకారం ల్యాండ్ పూలింగ్ ప్రయోజనాలను అమలు చేయాలని, పరిహారం, అభివృద్ధి ప్లాట్ల కేటాయింపు, స్టాంప్ డ్యూటీ తదితర అంశాలపై స్పష్టత కల్పించాలని అధికారులను కోరారు.
ముసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, భూ యజమానుల హక్కులు, ప్రయోజనాలు పరిరక్షించే విధంగా న్యాయబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సల్ల వీరారెడ్డి, పంగా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.