నిలదీస్తారా? తలవంచి తిరిగొస్తారా?
- తెలంగాణ 968 టీఎంసీల హక్కుపై ప్రధాని నుంచి హామీ తేవాలి
- సమ్మక్క సారక్క డీపీఆర్‌ను వెనక్కి పంపడం అన్యాయం
- ఇచ్చంపల్లి కాదని పోలవరం నుండి ప్రాజెక్ట్ చేపడితే సహించేది లేదు
- నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్ మరో ప్రజా ఉద్యమం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : తెలంగాణ నీటి ప్రయోజనాలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? లేక తలవంచి మౌనంగా తిరిగొస్తారా? అని మాజీమంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) ప్రశ్నించారు. నీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల ఢిల్లీ పర్యటనపై హరీశ్‌రావు స్పందించారు.
తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టుల అనుమతులకు ప్రధాని వద్ద స్పష్టమైన హామీ తీసుకురావాలని సూచించారు. 47 టీఎంసీల జలాల హైడ్రాలజీ క్లియరెన్స్ ఇప్పటికే పూర్తయిన సమ్మక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం రాష్ట్ర ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమ్మక ప్రాజెక్టుకు కేవలం టీఏసీ అనుమతి మాత్రమే రావాల్సి ఉందని, అది సాధించలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. కేంద్రం వద్ద తెలంగాణ వాదనను బలంగా వినిపించే చిత్తశుద్ధి రేవంత్ ప్రభుత్వానికి లేక పోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. శుక్రవారం విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులోనూ గోదావరి అనుసంధానాన్ని పోలవరం నుంచి బనకచర్ల వరకు చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా స్పష్టమైన వైఖరి తీసుకుందని, 968 టీఎంసీల గోదావరి జలాలపై తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ ముందుగా కేంద్రం అనుమతులు ఇవ్వాలి, ఆ తర్వాతే నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.
గోదావరి నుంచి కావేరికి తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం అంటే 75 టీఎంసీలు కేటాయించాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టుబట్టిందని, ఇచ్చంపల్లి నుంచే ఈ ప్రాజెక్టు చేపట్టాలని, తెలంగాణ భూభాగం మీదుగా అలైన్‌మెంట్ ఉండాలనే మన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర టాస్క్‌ఫోర్స్ సైతం హామీ ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఎన్‌డబ్ల్యూడీఏ ఇచ్చంపల్లి నుంచి గ్రాండ్ అనికట్ వరకు డీపీఆర్ రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. అందులో నుండి కీలకమైన మూడు రాష్ట్రాల తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక నుండి అనుమతులు కూడా వచ్చాయని, కేవలం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఆర్థికంగా వయబుల్ కానీ, ఏపీ మినహా ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం లేని ప్రాజెక్టును తెరపైకి తెచ్చి.. పోలవరం నుంచి బనకచర్లకు ప్రాజెక్టు అలైన్మెంట్ను మార్చారని ఆరోపించారు.
తెలంగాణకు చెందాల్సిన జలాలను లేకుండా చేస్తూ, తెలంగాణకు సంబంధించిన జాతీయ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టి ఏపీకి అనుకూలంగా మార్చే కుట్రను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారని హితవు పలికారు. తెలంగాణకు సంబంధించిన ఈ కీలక అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించకుండా, కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా వస్తే ఢిల్లీ పర్యటన అర్థరహితమన్నారు.