2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
- 35 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి
- 8 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, నవంబర్14(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి(Chief Minister) తన పదవిని పదవికి రాజీనామా చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య(MP R Krishnaiah) డిమాండ్ చేశారు.
శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 35 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. బీఈడీ, డీఈడీ అర్హతలున్న సుమారు 8 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో 12 వేల పాఠశాలల్లో ఇంగ్లీష్, గణితం, సైన్స్ బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడంతో విద్యార్థుల విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 14 వేలు, ఎయిడెడ్లో 5,900, గురుకులాల్లో 9 వేలు, ఆదర్శ పాఠశాలల్లో 4,500, కస్తూర్బా పాఠశాలల్లో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.
అన్ని యాజమాన్యాల పోస్టులకు కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయాలని, ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానాలు అమలు చేసి పోస్టులు మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, అల్లం యాదయ్య, భీమరాజు, రాజేందర్ పాల్గొన్నారు.