ఆ చిన్నారులకు దిక్కెవరు?
- అమ్మ కానరాని లోకాలకు.. నాన్న కటకటాల వెనక్కి..
- భార్యను చున్నీతో గొంతు బిగించి హతమార్చిన భర్త
- నాలుగు రోజుల క్రితమే ఉపాధి కోసం ఒడిశా నుంచి వలస
- రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ ఇటుక బట్టీల వద్ద ఘటన
ఆదిభట్ల, నవంబర్ 12 (విజయక్రాంతి): నాలుగు రోజుల క్రితమే బతుకుదెరువు కోసం ఆశలతో నగరానికి వచ్చిన ఆ కుటుంబంలో క్షణికావేశం తీరని చీకట్లు నింపింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ ముగ్గురు పసిపిల్లలను అనాథలను చేసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్(Adibatla Police Station) పరిధిలోని కొంగరకలాన్ సమీపంలో బుధవారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉన్సిద్ కుమారి(26), తన భర్త, ముగ్గురు చిన్నారులతో కలిసి ఉపాధి కోసం నాలుగు రోజుల క్రితం కొంగరకలాన్ సమీపంలోని ఇటుక బట్టీల వద్దకు వచ్చారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య జరిగిన వివాదం కాస్తా తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, భార్య గొంతుకు చున్నీ బిగించి ప్రాణాలు తీశాడు.
సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందో కూడా తెలియని వయసులో ఆ ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా అనాథలుగా మారిపోయారు. కళ్లముందే తల్లి విగతజీవిగా పడి ఉండటం, తండ్రి హత్య కేసులో నిందితుడిగా మారడంతో ఆ పిల్లలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఊరుకాని ఊరిలో, ఆదరించే దిక్కులేక బిక్కుబిక్కుమంటున్న వాళ్లను చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. అధికారు లు తక్షణమే స్పందించి, ఆ పిల్లల ఆలనాపాలనా బాధ్యతలు చేపట్టి వారికి భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.