యాసంగి సాగుపై నీలినీడలు
నిజాంసాగర్ నీళ్లు అందేనా?
సగానికి పడిపోయిన జలాశయ నీటి నిల్వ
ప్రస్తుతం 9.174 టీఎంసీలు మాత్రమే
ఆరుతడి పంటలకైనా నీరిస్తారా లేదా? స్పష్టత ఇవ్వని నాయకులు, అధికారులు.
నిజాంసాగర్ నవంబర్ 12(విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు సగానికి పడిపోవడంతో యాసంగి (రబీ) సాగుపై ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గతేడాది ఇదే సమయానికి పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడిన ప్రాజెక్టు.. ప్రస్తుతం 9.174 టీఎంసీల నీటి నిల్వకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో యాసంగి సాగుకు నీళ్లు విడుదల చేస్తారా? కనీసం ఆరుతడి పంటలకైనా నీరందిస్తారా? అన్న విషయంపై ప్రజాప్రతినిధులు,నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం అన్నదాతలను సందిగ్ధంలో పడేసింది.
నిల్వ ఉన్న నీటితో సాగు సాధ్యమేనా?
ప్రాజెక్టు ప్రధాన కాలువ (82 డిస్ట్రిబ్యూటరీల) కింద జుక్కల్,బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 1.50 లక్షల నుంచి 1.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 9.174 టీఎంసీల నీటిలో డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలు (రోజుకు 148 క్యూసెక్కులు), వేసవిలో బోధన్,నిజామాబాద్ పట్టణాల తాగునీటి అవసరాలకు సుమారు 3 నుంచి 4 టీఎంసీలు పోను.. సాగుకు మిగిలేది కేవలం 4 నుంచి 5 టీఎంసీల నీరు మాత్రమే. ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ఈ కొద్దిపాటి నీటిని ఎలా వాడుకోవాలన్న దానిపై అధికారులు ఇంకా లెక్కలు తేల్చలేదు.
సందిగ్ధంలో అన్నదాతలు
వానాకాలం కోతలు ముగిసి యాసంగి పనులకు సమయం ఆసన్నమైనప్పటికీ, నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న నీటితో వరి సాగుకు అవకాశం లేదని అధికారులు ముందుగానే చెబితే, రైతులు మక్కజొన్న, జొన్న, శనగ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కానీ అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఇంజనీరింగ్ అధికారులు నోరు మెదపకపోవడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలు విషయంలో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉన్న 9.174 టీఎంసీల నీటిలో తాగునీటి అవసరాలు పోను, సాగుకు ఎన్ని టీఎంసీలు, ఏ డిస్ట్రిబ్యూటర్ వరకు,ఇస్తారో అధికారికంగా ప్రకటించాలి. ఆయకట్టు మొత్తానికి పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోయినా, కనీసం ఆరుతడి పంటలకైనా 4 నుంచి 5 తడులు అందిస్తామని భరోసా ఇవ్వాలి., నీటి విడుదలపై నిర్ణయం తీసుకుని, చివరి ఆయకట్టు వరకు నీరు వృథా కాకుండా చేరేలా కాలువల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్పందించి నిజాంసాగర్ నీటి విడుదలపై తక్షణమే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయకట్టు రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.