CEO కుర్చీకి ఎసరు
అమెరికా: ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తున్న Nvidia సంస్థలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO జెన్సన్ హువాంగ్ పదవికి ముప్పు ఏర్పడినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు సంబంధించిన రెండు వివాహేతర సంబంధాల వ్యవహారం వివాదంగా మారడంతో కంపెనీ Board of Directors ఆయన భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీటిలో ఒక సంబంధం చైనా గూఢచర్యంతో సంబంధం ఉందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న వ్యక్తితో ఉన్నట్లు ఆరోపణలు రావడం మరింత సంచలనం సృష్టిస్తోంది. మరో సంబంధం కంపెనీలోనే పనిచేస్తున్న ఓ ఉద్యోగితో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం నాటికే బోర్డు సమావేశమై ఆయన కొనసాగింపుపై చర్చించనున్నట్లు సమాచారం.
అయితే జెన్సన్ హువాంగ్ను CEO పదవి నుంచి తొలగించినట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలు, కంపెనీపై వాటి ప్రభావం, జాతీయ భద్రతకు సంబంధించిన అనుమానాలపై అంతర్గత విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంపై హువాంగ్ కుటుంబ సభ్యులకు, ఉద్యోగులకు క్షమాపణలు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు Nvidia మాత్రం ప్రపంచవ్యాప్తంగా Artificial Intelligence (AI) విప్లవానికి కీలకమైన చిప్‌లను అందిస్తూ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 1993లో సంస్థను స్థాపించిన హువాంగ్ నాయకత్వంలోనే కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఇప్పుడు ఆయన పదవిపై అనిశ్చితి నెలకొనడంతో కంపెనీ భవిష్యత్ Leadership, AI మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.