మురుగు కాలువలు ధ్వంసం
ముందుకు సాగని మురుగునీరు
ఇనుగుర్తి, నవంబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన గ్రామం, నూతనంగా ఏర్పడ్డ మండల కేంద్రం ఇనుగుర్తి(Inugurthi ) లో ఏండ్ల కాలం నాటి డ్రైనేజీ కాలువలు(Drainage Issues) పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో మురుగునీరు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని అనేక వీధుల్లో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధ భరితంగా మారాయి.
మండల కేంద్రంలో ప్రధాన రహదారుల వెంట కూడా సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వరద నీరు కూడా అనేకచోట్ల నిలిచిపోతోంది. దీనివల్ల మండల కేంద్రంలో అనేక అంతర్గత వీధుల్లో సైడ్ కాలువలు అపరిశుభ్రంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక వీధుల్లో డ్రైనేజీ కాల్వలో పూడిపోయాయి.
డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు లేకపోవడంతో అరకొర నిధులతో చాలాకాలంగా నెట్టుకొస్తున్నారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, పాత కాలంలో నిర్మించిన కాలువలను పూర్తిగా తొలగించి కొత్తవి నిర్మించి, మురుగు నీరు, వరద నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు చర్యలు
మండల కేంద్రంలో పాడైపోయిన మురుగు కాలువలను ఉపాధి హామీ, జీపీ జనరల్ ఫండ్ విధులతో మరమ్మతులు చేపడతాం. ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు అనుమతి ఇచ్చింది. ఇందులో దాదాపు 60 కి పైగా సైడ్ కాల్వలను నిర్మిస్తాం. అలాగే అత్యవసరమైన చోట జీ పీ నిధులతో సైడ్ కాలువల మరమ్మతులు చేపడతాం.
ఇప్పటికే ఆయా పనులకు సంబంధించిన అంచనాలను రూపొందించి, తీర్మానాలు కూడా చేసి సిద్ధంగా ఉంచాం. త్వరలో పనులు చేపట్టడానికి చర్యలు తీసుకొని, ఇనుగుర్తిలో మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకుంటాం.
-తమ్మడపల్లి కుమార్, సర్పంచ్, ఇనుగుర్తి