ఆధారాల్లేకుండా ఆరోపిస్తే చట్టపరమైన చర్యలే
తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మరో కీలక బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్‌గా (Director General) అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన ఆయనను ఇటీవల ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బదిలీపై కొందరు విమర్శలు చేయడం, మరికొందరు సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆరోపణలు గుప్పించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై సజ్జనార్ ఘాటుగా స్పందించారు. కొందరు కేవలం తమ ఉనికిని చాటుకోవడం కోసమే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేసేవారు కచ్చితంగా చట్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తన వ్యక్తిత్వంపై అసత్య ప్రచారాలు చేసేవారి విషయంలో చట్టపరమైన చర్యలకు (Legal Action) వెనుకాడబోనని స్పష్టం చేశారు.
తన బదిలీపై జరుగుతున్న ప్రచారానికి కూడా సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. 26 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎస్ సర్వీసులో ఇప్పటివరకు 20 సార్లు బదిలీ అయ్యానని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు అనేవి సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా పూర్తి అంకితభావంతో, నిజాయతీతో పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.