వెలవెలబోతున్న సింగూరు
- డెడ్ స్టోరేజీకి జలాలు
- 2.289 టీఎంసీలకే పరిమితమైన నిల్వ
- ముంచుకొస్తున్న తాగు, సాగు నీటి గండం
- మెదక్ జిల్లాలో నెర్రెలు వారిన పొలాలు
సంగారెడ్డి బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాకు గుండెకా య లాంటి సింగూరు ప్రాజెక్టు(Singur Project) చరిత్రలో ఎ న్నడూ లేని విధంగా అత్యంత దయనీయ స్థి తికి చేరుకుంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 2.289 టీఎంసీల నీటి ని ల్వ(Water storage in TMCs) మాత్రమే ఉంది.
పూర్తి స్థాయి నీటి మట్టానికి దరిదాపుల్లో కూడా లేకపోవడంతో అటు సాగునీరు, ఇటు తాగునీటి సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ముంచుకొస్తోంది. వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రా ంతాల నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు అడుగంటిపోయింది. ఈ దుస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుండగా, ప్రజల్లో తాగునీటి భయాన్ని రేకెత్తిస్తోంది.
సింగూరు నీటిపైనే పూర్తిగా ఆధారపడిన సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతాంగం ఇప్పుడు ఆకాశం వైపు, ప్రభుత్వం ప్రకటించే ప్రత్యామ్నాయ ప్యాకేజీలు లేదా సహాయం వైపు దీనంగా చూస్తోంది. సింగూరు నీటిపై ఆధారపడి ఉమ్మడి మెదక్ జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ముఖ్యంగా ఆందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు రైతులకు ఈ ప్రాజెక్టే ప్రధాన ఆధారం.
నీటి నిల్వలు 2.289 టీఎంసీలకు పడిపోవడంతో ఈ రబీ (యాసంగి) సీజన్లో సాగునీరు ఇవ్వడం అసాధ్యమని అధికారులు ఇప్పటికే చేతులెత్తేశారు. నమ్మకంతో నారుమళ్లు పోసుకున్న రైతులు ఇప్పుడు నీరు లేక పంటలు ఎండిపోతుంటే ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. బావు లు, బోరు బావుల్లోనూ భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.
సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఉమ్మడి మెదక్ (సంగారెడ్డి, మెదక్) జిల్లాల్లో దాదాపు 40,000 ఎకరాల ఆయకట్టు ప్రత్యక్షంగా సాగు నీటి సదుపాయాన్ని పొందుతోంది. దీనితో పాటు మంజీరా నది పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలాలు పెరగడం ద్వారా పరోక్షంగా మరో వేలాది ఎకరాలకు ఇది ఆధారం. ప్రాజెక్టు ప్రధాన కాలువలైన లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ద్వారా సంగారెడ్డి, ఆందోల్, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది.
ముఖ్యంగా ఆందోల్, పుల్కల్ మండలాల్లో అత్యధిక సాగు విస్తీర్ణం ఉంది. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా నది ప్రవాహం, స్థానిక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా మెదక్, హ వేలి ఘనపూర్ వంటి పరిసర ప్రాంతాల్లో సుమారు 10 వేల ఎకరాల వరకు సాగు భూములకు నీరు అందుతుంది. అయితే అ నధికారికంగా రెండు జిల్లాల పరిధిలో మరో 30వేల ఎకరాల వరకు సాగు అవుతుంది.
యాసంగి సాగుపై నీలినీడలు
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 2.7 టీఎంసీలకు (ఉపయోగకర నిల్వ కేవలం 0.7 టీఎంసీలు) పడిపోవడం, తాజాగా తాగునీటి కోసం 0.15 టీఎంసీలు మంజీరా బ్యారేజీకి విడుదల చేయడంతో ప్రస్తుతం 2.289 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆయకట్టు పరిధిలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయి.
సాధారణంగా ఈ పాటికి కాలువల ద్వారా యాసంగి పంటలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ డెడ్ స్టోరేజీకి చేరువగా ఉండటంతో ఈ సీజన్లో సాగునీరు విడుదల చేయడం అసాధ్యమని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల దాదాపు 40 వేల ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. సింగూరులో నీరు లేకపోవడంతో మంజీరా నదీ తీర ప్రాంతాల్లో, ఆయకట్టు గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. రైతులు వేసుకున్న బోరుబావులు, బావుల్లో నీరు ఎండిపోతోంది.
ప్రత్యామ్నాయ పంటలే దిక్కు
నీరు ఎక్కువగా కావాల్సిన వరి పంటను సాగు చేయవద్దని అధికారులు హెచ్చరించడంతో, కొందరు రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల (పెసర్లు, శనగలు, జొన్నలు) వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటికే నారుమళ్లు పోసి, వరి నాట్లకు సిద్ధమైన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా లేదా కరెంట్ మోటార్లపై నమ్మకంతో రిస్క్ తీసుకుంటున్నారు. పంటలు పండకపోవడంతో రాబోయే వేసవిలో పశువులకు మేత కొరత ఏర్పడేలా ఉంది. వ్యవసాయ పనులు లేక కూలీలు వలస వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడి
సింగూరు కేవలం సాగునీటికే కాదు.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలు, వందలాది గ్రామాలకు తాగునీటిని అందిస్తుంది. ప్రాజెక్టులో నీరు డెడ్ స్టో రేజీకి చేరువ కావడంతో మిషన్ భగీరథ ప థకం ద్వారా గ్రామాలకు సరఫరా అయ్యే తాగునీటిపై తీవ్ర ప్రభావం పడనుంది. జంట నగరాల తాగునీటి అవసరాల కోసం సిం గూరు నుంచి రోజువారీగా తరలించే నీటి కోటాకు కూడా ఇప్పుడు గండం పొంచి ఉంది.
ఉన్న కొద్దిపాటి నీటిని కేవలం అత్యవసర తాగునీటి అవసరాలకే ఉంచాలా అనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే సంగారెడ్డి పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి అధికారులు సింగూరు ప్రాజెక్టు నుండి మంజీరా బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలోని 4, 5, 6 నం బర్ క్రెస్ట్ గేట్లను ఒక మీటరు మేర ఎత్తి మొ త్తం 0.15 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.
జలాశయంలో నీటి నిల్వలు గణనీయంగా అడుగంటినప్పటికీ, తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీ సుకున్నారు. నీటి విడుదల కొనసాగుతుండటంతో సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వ మ రింత తగ్గి ప్రస్తుతం 2.289 టీఎంసీలకు పడిపోయిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ప్రత్యామ్నాయాలేవి?
రాబోయే వేసవి కాలం నాటికి పరిస్థితి మరింత భయానకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ జల వనరులను వెతుక్కోకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తాగునీటి కోసం జనం వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి, మంజీరా జలాలను ఎలా సద్వినియోగం చేయాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
(ఎ.చంద్రశేఖర్ రావు)