దీక్ష దివస్ విజయవంతం చేయాలి
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర(Telangana history)లో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని, దీక్షా దివస్(Deeksha Divas) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(Former MLA Banoth Shankar Naik) నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు, తండాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 2009 నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని రోజన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ గమనాన్ని పూర్తిగా మార్చిన చారిత్రాత్మక ఘట్టం. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష, అన్యాయం, వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి ఆ దీక్ష ఒక మహత్తర మలుపుగా నిలిచిందన్నారు. 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' అనే నినాదం ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి, భాష, ప్రాంతీయ హక్కుల సాధనే ఉద్యమ ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాయిని రంజిత్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.