జలసిరి పనుల్లో ఇరవెండికి ప్రశంసలు

28-11-2026 | 07:36pm

జిల్లాలోనే తొలి నీటి తొట్టి నిర్మాణం.. ఏపీడీ రమణ అభినందన

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని ఇరవెండి గ్రామపంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ పనులను డీఆర్‌డీఏ ఏపీడీ రమణ శనివారం పరిశీలించారు. జిల్లాలోనే ఆదర్శంగా నిలిచేలా పనులు చేపట్టినందుకు సర్పంచ్ గుండి బాబురావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు, కార్యదర్శి స్పందనను అభినందించారు.పల్లె ప్రకృతి వనంలో నిర్మించిన నీటి తొట్టితో పాటు బోరుబావి రీఛార్జ్ పిట్, డ్రైన్ ఎండ్ సోక్ పిట్, కమ్యూనిటీ సోక్ పిట్, వ్యవసాయ కుంట, రెండు మ్యాజిక్ సోక్ పిట్లను పరిశీలించారు.

వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం, మురుగునీటి సమస్యను నివారించడం, మూగజీవాలు, పక్షుల దాహార్తి తీర్చడం వంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇరవెండిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో జలసిరి పనులు చేపట్టాలని సూచించారు. గ్రామంలో నీటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని సర్పంచ్, ఉప సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు