యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి
- జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
హాజీపూర్, (విజయక్రాంతి) : యాసంగిలో రైతులు(Farmers) వరి పంటకు(Paddy crop) బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ(District Agriculture Officer Surekha) కోరారు. మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కరువు ప్రభావిత రైతులకు వ్యవసాయ రుణాల(Agricultural loans) పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావం, కరువు పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంపై ఏర్పడిన ప్రతికూల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, కరువు ప్రభావిత రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు అర్హులైన రైతుల వ్యవసాయ రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
కరువు ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన రైతులకు వ్యవసాయ రుణాలపై 12 నెలల మారటోరియం కల్పించడంతో పాటు, రుణ చెల్లింపు గడువును 36 నెలలకు పొడిగించే వెసులుబాటు కల్పించనున్నట్లు డీఏఓ సురేఖ రైతులకు వివరించారు. ఈ రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నిబంధనలు, అర్హతలు, బ్యాంకుల ద్వారా కల్పించనున్న ఆర్థిక ఉపశమన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదుపాయాలను పొందేందుకు అర్హులైన రైతులు తాము పంట రుణం తీసుకున్న సంబంధిత బ్యాంకు శాఖలో 2026, డిసెంబర్ 8లోపు బ్యాంకు సమ్మతి పత్రం (Bank Consent) సమర్పించాలని సూచించారు.
కరువు ప్రభావిత రైతులు తమ రుణ అర్హత, రుణ పునర్వ్యవస్థీకరణ, మారటోరియం, రుణ చెల్లింపు గడువు పొడిగింపునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తమ సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి, నిర్దేశిత గడువులోగా సమ్మతి పత్రం సమర్పించాలని డీఏఓ కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) మామిడి కృష్ణ, హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి (MAO) కృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మధుప, బ్యాంకు అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.