గంజాయి విక్రేతల అరెస్ట్

28-11-2026 | 10:10pm

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు(Thorrur ) పట్టణంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న(Selling Cannabis) వరంగల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గంజాయి వినియోగానికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు తొర్రూరుకు చెందిన అన్నందాస్ నవనీత్, రాయపురం రాజ్‌కుమార్‌లను విచారించగా, వారు ఇచ్చిన సమాచారంతో వరంగల్‌కు చెందిన పెండ్యాల అక్షయ్, హనుమకొండ చరణ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద తనిఖీ చేయగా 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో ఇద్దరూ గంజాయి వినియోగించినట్లు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిందితుల్లో పెండ్యాల అక్షయ్ గతంలో ఇనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 23/2025 ఎన్‌డీపీఎస్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

"ఎన్‌డీపీఎస్ చట్టం, బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద కేసు నమోదు

ఈ ఘటనపై తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 485/2026 కింద ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం గంజాయిని అక్రమంగా కలిగి ఉండటం, వినియోగానికి సంబంధించి కేసు నమోదు చేశారు. అంతేకాకుండా బీఎన్‌ఎస్ సెక్షన్ 111ను కూడా వర్తింపజేశారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నారు.

తొర్రూరు పోలీసుల పనితీరును అభినందించిన ఎస్పీ

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై సమర్థవంతంగా చర్యలు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన తొర్రూరు పోలీసుల పనితీరును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ, పట్టుదలతో పనిచేసిన తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్, ఎస్ఐ ఖాదర్ పాషా, మహేందర్, సీఐ గణేష్‌లను ప్రశంసించారు. ఇదే విధమైన సమన్వయం, అంకితభావంతో పనిచేస్తూ జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు