‘వాట్సాప్'తో ఆరేళ్ల బాలుడి ఆచూకీ లభ్యం

16-11-2026 | 12:24pm

మహబూబాబాద్,(విజయక్రాంతి): తండ్రి మందలించాడని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆరేండ్ల బాలుడి(6-Year-Old Boy) ఆచూకీ వాట్సాప్(WhatsApp) ద్వారా లభించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన దంపతులు కేసముద్రం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణంలో పనిచేయడానికి కుటుంబంతో సహా వచ్చారు. ఈ క్రమంలో ఆరేళ్ల బాలుడు తరచుగా నూతనంగా నిర్మిస్తున్న మూడు అంతస్తుల భవనం పైకి ఎక్కి ఆడుకుంటుండగా తండ్రి పైనుంచి పడిపోతావు అని గట్టిగా మందలించాడు.

ఇంట్లో నుంచి బయటికి రావద్దని హెచ్చరించడంతో ఆ బాలుడు రెండు రోజుల క్రితం చెప్పా పెట్టకుండా కేసముద్రం రైల్వే స్టేషన్ కు వచ్చి అక్కడ నుండి సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు(Singareni Express Train) ఎక్కాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కేసముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన సీఐ సత్యనారాయణ(CI Satyanarayana), ఎస్ ఐ క్రాంతి కిరణ్ బాలుడి ఫోటోతో సహా ఆచూకీ తెలపాలని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు.

అలాగే తమకు నమ్మదగిన సమాచారం ఇచ్చే వారికి, వివిధ వాట్సాప్ గ్రూపుల్లో కూడా బాలుడి ఫోటోలు షేర్ చేశారు. వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తి కొత్తగూడెంలో బాలుడు తిరుగుతున్నట్లు గుర్తించి వెంటనే అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరుబాలుడ్ని పోలీసులు చేరదీసి కేసముద్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడిని సురక్షితంగా కాపాడినందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. కొత్తగూడెం నుంచి బాలున్ని కేసముద్రం తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు