గాంధీ ట్రస్ట్ భూములు, డంపింగ్ యార్డు సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన
ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ(Jadcharla Municipality) పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మధుసూదన్ నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్, మున్సిపల్ సిబ్బందితో కలిసి గాంధీ ట్రస్ట్ భూముల(Gandhi Trust lands)ను సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ ట్రస్ట్ భూములకు సంబంధించిన సమస్యలు, వివాదాలు, స్థానికుల అభ్యంతరాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డును సందర్శించి, దాని నిర్వహణపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.