నిజమైన లంచగొండి అనిరుధ్ రెడ్డే!

20-11-2026 | 12:59am

అధికారులపై ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు

బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి

ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చెయ్యడం కొండారెడ్డిపల్లి కొడంగలే కాదు రాష్ట్రమంతా చేయాలి

జడ్చర్ల: అధికారులను లంచగొండులంటూ ఆరోపిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డే నిజమైన లంచగొండి అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి ప్రత్యారోపణ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా అధికారులపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. గురువారం జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పట్టించుకోకుండా అధికారులను లంచగొండులుగా చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. తాను సుద్దపూసనన్నట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్నారని తాము ఆరోపిస్తున్న సెటిల్మెంట్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

పనులకు బిల్లులు రావడం లేదంటూ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్న ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారం కోసం ప్రకటించిన అమరణ నిరాహార దీక్ష ఏమైందని నిలదీశారు. వెంటనే దీక్ష తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దీక్షకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.

జడ్చర్ల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి విషయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లపై కూడా ఆయన స్పందించారు. తహసీల్దార్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు సంబంధించిన స్థలాలు ఎమ్మెల్యే వ్యక్తిగత ఆస్తులు కావని, వాటిని ఇష్టానుసారంగా కేటాయించడం, ఇతర అవసరాలకు ఇచ్చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆ స్థలాలను ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు సొంతంగా భూములు ఉంటే ఆసుపత్రి కోసం వాటిని ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం బీపీ కొలిచే యంత్రం కూడా లేదని ఆరోపించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్య సిబ్బందిని నియమించడంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని సూచించారు.

అభివృద్ధి చేయడం అంటే కేవలం కొండారెడ్డిపల్లి కొడంగల్ నియోజకవర్గం లో మాత్రమే చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి చేసినట్లు కాదని రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిననే తాను ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ప్రతి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కేవలం తన గ్రామం తన నియోజకవర్గానికి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించడం తగదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తమ నియోజకవర్గానికి నిధులు రావడంలేదని ఆరోపణలు చేయడం వెనక అంతర్యం ఏమిటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన కోరారు

నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇతర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని జనార్ధన్ రెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, సీనియర్ నాయకులు రాపోతుల శ్రీనివాసులు, ఎంబి బాలకృష్ణ, ముచ్చర్ల కృష్ణయ్య,బుక్క నవీన్, పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు