హెచ్ఐవీ నియంత్రణలో 'సురక్షిత జిల్లా'గా మంచిర్యాల

20-11-2026 | 01:18am

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(National AIDS Control Organization) నిర్దేశించిన హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా 95:95:95 లక్ష్యాలను విజయవంతంగా సాధించిన మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 20 సురక్షిత జిల్లాల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అధికారుల బృందం కలెక్టర్ కలెక్టర్ కుమార్ దీపక్ ను శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చూపిన అంకితభావం, సమర్థవంతమైన నాయకత్వం, వివిధ శాఖల మధ్య సమన్వయం, అందించిన సహకారంతో ఈ విజయం సాధ్యమైందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, దిశ బృందం, వివిధ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లాలో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు, చికిత్స సేవలు, ప్రజలలో అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలిగామన్నారు.

భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లాను సురక్షిత జిల్లాగా కొనసాగించేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి జి ఎ సి ఎ సి ఎస్ జాయింట్ డైరెక్టర్ (ప్రివెన్షన్) కె.ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, హెచ్ఐవి, ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, దిశ సిపిఎం నీలిమ, డెమో వెంకటేశ్వర్లు, సిఎస్ఓ రాజేష్, డీఎండీఓ సంతోష్, అధికారులు, మంచిర్యాల సంపూర్ణ సురక్ష కేంద్రం బృందం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు