యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

20-11-2026 | 01:02am

చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్  శ్రీనివాస్

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): యువత మత్తు పదార్థాల(Youth drug addiction)కు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నుచ్ఛు శ్రీనివాస్(Chief Legal Aid Defense Counsel Nuchhu Srinivas) అన్నారు.  తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్  ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  సునీత కుంచాల సూచనలతో గురువారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని  మహాత్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల లో డ్రగ్స్ వినియోగంపై విద్యార్థినీలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నుచ్ఛు శ్రీనివాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్  భాను కృష్ణ  మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, చదువు, కుటుంబం, జీవితం అన్నీ నాశనం అవుతాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, డబ్బు కోసం చివరకు దొంగలుగా కూడా మారే ప్రమాదం ఉందని తెలిపారు.

తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి వ్యసనాలకు ఖర్చు చేసి, వారిని కూడా క్షోభకు గురి చేయవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థినులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, స్నేహితుల ప్రోద్బలంతో కూడా వాటి జోలికి వెళ్లవద్దని సూచించారు.

మాదకద్రవ్యాలకు ఎవరైనా బానిసలైనట్లయితే వారికి కౌన్సెలింగ్, చికిత్స, పునరావాస సేవలను పొందే విధానాలపై  అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని, అలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు గానీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా  తెలపాలని సూచించారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్  బి.వనజ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు