ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
ఐఆర్సీఎస్ మంచిర్యాల చైర్మన్ భాస్కర్ రెడ్డి
మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలోని రక్త నిధి కేంద్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ జిల్లా శాఖ చైర్మన్ కె. భాస్కర్ రెడ్డి గురు వారం తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) జెండగే హనుమంత్ కొండిబా కి వినతి చేశారు. నిధుల విడుదల కోసం రాష్ట్రంలోని ఉన్నతాధికారుల కార్యాలయాలను సందర్శిస్తూ, సంబంధిత అధికారులను స్వయంగా కలిసి రక్త నిధి కేంద్రానికి పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వరుసగా వినతిపత్రాలు అందిస్తూ వస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలోని రక్తనిధి కేంద్రం ద్వారా ప్రతినెలా దాదాపు 236 మంది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా రక్త మార్పిడి, అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్‌లు, మందులు తదితర సేవలను నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన వైద్య సేవలకు సంబంధించి 2023, అక్టోబర్ 31 నుంచి నిధులు పెండింగ్‌లో ఉండటంతో రక్తనిధి కేంద్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు.
ఇప్పటి వరకు 1,657 కేసులకు సంబంధించి అకౌంట్ వెరిఫికేషన్ పూర్తయిందని, మరో 989 కేసులకు సంబంధించిన క్లెయిమ్‌లను చెల్లింపుల నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించడం జరిగిందని, అయినప్పటికీ, నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో రక్తనిధి కేంద్రానికి అవసరమైన మందులు, రియాజెంట్లు, టెస్టింగ్ కిట్లు, రసాయనాలు కొనుగోలు చేయడంతో పాటు సిబ్బంది జీతభత్యాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అందించే నిరంతర వైద్య సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
వేలాది మంది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ కె. భాస్కర్ రెడ్డి కోరారు. మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలోని రక్త నిధి కేంద్రానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని, తద్వారా మరింత మంది తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు నిరంతరాయంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ నిధుల విడుదల కోసం ఈ నెల 14న రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ దానకిషోర్ కి, 17న తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ V. వాణిలకు సైతం నిధుల విడుదలకు సంబంధించి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. నిధుల విడుదల ఆలస్యమైతే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయే అవకాశముందని చెప్పటం జరిగిందని, వీరు సానుకూలంగా స్పందించి నిధులను త్వరలో విడుదల చేస్తామని చెప్పారని వెల్లడించారు.