మరో 11,275 మందికి చేయూత పింఛన్లు!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) పింఛన్ లబ్ధిదారులకు మరో శుభవార్త అందించింది. మూడు ప్రత్యేక కేటగిరీలకు చెందిన 11,275 మందికి కొత్తగా చేయూత పింఛన్లు(Cheyutha Pensions) మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత దస్త్రంపై మంత్రి సీతక్క(Minister Seethakka) ఆమోదం తెలిపారు. తాజా మంజూరులో ఫైలేరియా బాధితులకు 5,895, ఎయిడ్స్ బాధితులకు 3,024, డయాలసిస్ రోగులకు 2,356 పింఛన్లు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల సంఖ్య 4,75,132కు చేరింది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ నెల 26న పింఛన్ సొమ్ము జమ చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా లభించనుంది.