అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు

28-11-2026 | 05:07pm

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి (Development) పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు అభివృద్ధిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.650 కోట్ల పరిహారం (Compensation) విడుదల చేసిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.1,200 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టినట్లు తెలిపారు.

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండో దశకు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల (Pending Projects) పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, విమర్శలకు అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఏ కలీం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు