బాల్య వివాహాల నిర్మూలనపై ఐసీడీఎస్ అవగాహన!

28-11-2026 | 12:04am

జన్నారం, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండల కేంద్రంలో కిస్టాపూర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో శుక్రవారం 'ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్, ఎర్లీ అండ్ ఫోర్స్డ్ మ్యారేజ్(International Day for the Elimination of Child, Early and Forced Marriage)' (బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం) సందర్భంగా ఐసీడీఎస్ (ICDS) ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక సర్పంచ్ వాసాల నరేష్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పి. వాణి మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు.

చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల బాలికలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడికి గురవుతారని, చదువు మధ్యలోనే ఆగిపోయి భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛను కోల్పోతారని వారు వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతారని స్పష్టం చేశారు.

అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి, గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు స్వరూప, వనిత, కేజీబీవీ ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు