తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలి

03-11-2026 | 08:30pm

ఎమ్మెల్యే జియంఆర్..

దేవరకద్ర నవంబర్ 3 (విజయక్రాంతి): ఎల్ నినో(El Nino), కరువు పరిస్థితులపై దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudan Reddy) ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, కరువు ముప్పు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, తాగునీటి అవసరాలు తదితర కీలక అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమగ్రంగా, సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం, లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో, వాటి పరిస్థితులపై గ్రామస్థాయిలో ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకునేలా రైతులకు సంబంధిత శాఖల అధికారులు తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు.

రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయంలో నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలు, రైతులకు ఉపయోగపడే ప్రత్యామ్నాయ సాగు విధానాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.

కరువు పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి సమస్యలు తలెత్తకుండా ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన పనులను గుర్తించి ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే అలాగే కరువు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను సమర్థవంతంగా అమలు చేస్తూ అర్హులైన కూలీలకు పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా ఈ సమావేశంలో వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, వైద్య ఆరోగ్య, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖలకు చెందిన అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా చర్చించారు. ఆయా శాఖల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, రైతులు మరియు గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రానున్న రోజుల్లో చేపట్టనున్న కార్యాచరణ గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ప్రతి శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాల అర్హతలు, వాటిని పొందేందుకు అనుసరించాల్సిన విధానాలు, అందుబాటులో ఉన్న ప్రోత్సాహకాల గురించి ప్రజాప్రతినిధులకు, రైతులకు, గ్రామీణ ప్రజానీకానికి వివరించాలని ఎమ్మెల్యే  అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎల్ నినో, కరువు పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, పశుసంవర్ధక, గ్రామీణ ఉపాధి వంటి కీలక శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

కరువు సంబంధించి ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం, సమస్యలను ముందుగానే గుర్తించడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం ద్వారా రానున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఎమ్మెల్యే జియంఆర్  తెలిపారు.

ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని, దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మున్సిపల్ చైర్మన్ దమయంతి, ఎంపీడీఓలు, అగ్రికల్చర్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, హార్టికల్చర్, వెటర్నరీ అధికారులు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు