ముచ్చింతల పీఏసీఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

28-11-2026 | 04:42pm

 * పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)

 * రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

చిన్నచింతకుంట నవంబర్ 28 : మండల పరిధిలోని ముచ్చింతల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Muchintala Primary Agricultural Cooperative Society) (పీఏసీఎస్) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరకద్ర(Devarakadra) నియోజకవర్గ శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పీఏసీఎస్ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లుగా బోయ వెంకటన్న, సీతా నాయక్, గంగాల ఆనందం, పి. రాము, చిలకట్టి శ్రీనివాసులు, కురువ నర్సింహులు, మల్లేల బాల్ రెడ్డి, గుంజ పుష్పలత, తిరుపతి రెడ్డి, ఎం.ఎస్. పద్మమ్మ, బోయ గోపాల్, వెంకటేష్ తదితరులతో జిల్లా సహకార శాఖ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట వేశామన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేసి, రైతులకు ఎరువులు, విత్తనాలు, రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత నూతన పాలకవర్గంపై ఉందని సూచించారు. దేవరకద్ర నియోజకవర్గంలోని 9 పీఏసీఎస్‌లలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించామని తెలిపారు.

అనంతరం గత బీఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవరకద్రకు డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఏటీసీ సెంటర్ వంటి ఎన్నో అభివృద్ధి పనులను మంజూరు చేయించామని వివరించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఏఐసీసీ అబ్జర్వర్ రవీందర్ దాస్, పీసీసీ కోఆర్డినేటర్లు సిద్ధేశ్వర్, పృథ్వీ, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, సహకార సంఘాల చైర్మన్లు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు