రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

12-11-2026 | 11:15pm

రూ.300 కమిషన్ పెంపు హామీని అమలు చేయాలి

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి సంక్షేమ సంఘం వినతి 

మిడ్జిల్: రాష్ట్రంలోని 17,200 మంది రేషన్ డీలర్ల(Telangana Ration Dealers)కు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు రూ.300 కమిషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం(Ration Dealers Welfare Association) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చాలీచాలని కమిషన్‌తో రేషన్ డీలర్లు ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.  అలాగే రేషన్ షాపుల ద్వారా మరిన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, కష్టకాలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు సరుకులు అందించి ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎన్నం సత్యనారాయణ గుప్తా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొంగల నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి చెన్నారెడ్డి, ఎం.డి. అన్వర్ పాషా, బాలానగర్, మిడ్జిల్, రాజాపూర్ మండలాల అధ్యక్షులు తుల్జా నాయక్, మార్కండేయ గౌడ్, రామాచారి తదితర జిల్లా, మండలాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు