స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి
- కనీస వేతనం రూ. 42 వేలు చెల్లించాలి
- సీఐటీయు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : స్కీమ్ వర్కర్లను(scheme workers) కార్మికులుగా గుర్తించి, వారి కనీస వేతనం రూ. 42 వేలు చెల్లించాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి(CITU District Secretary) దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనం రూ. 42 వేలు, కనీస పెన్షన్ పెంపు,
సమస్త కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే ‘ఛలో ఢిల్లీ పార్లమెంట్’కు సంబందించిన వాల్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా కార్మికుల వేతనాలు, ఆదాయం, పెన్షన్లలో ఎదుగూ, బొదుగూ లేదన్నారు.
మన శ్రమతో సృష్టించిన సంపదలను పోగేసుకుని యజమానులు కుబేరులవుతున్నారన్నారు. పాలక వర్గాలకు కార్మిక సంక్షేమం ఏ మాత్రం పట్టడం లేదని, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే పాలక వర్గాల ప్రయోజనాలుగా మారాయన్నారు.
మనకు ఏ రంగంలో చూసినా అదానీ, అంబానీ, టాటా, బిర్లా, మిట్టల్లు పాలక వర్గాల ప్రతినిధులుగా ప్రత్యక్షమౌవుతున్నారని, రాజ్యాంగం, రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ స్వయం ప్రతిపత్తి గల సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుని, కార్మిక, ప్రజాస్వామ్య హక్కులపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని మండి పడ్డారు.
దేశంలో ఒక శాతం ఉన్న సంపన్నుల వద్ద దేశ సంపదలో 40 శాతం ఉండగా, 50 శాతంగా ఉన్న ప్రజల వాటా 6 శాతం మాత్రమే ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపన్నుల మీద జాలి ఎక్కువ అని, కార్మికులకు కనీస వేతనాలు పెంచేందుకు వారికి చేతులు రావడం లేదని, మనం చెల్లించే పన్నులతో కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలకు ఎదురు రాయితీలు ఇచ్చి వారిని మరింత సంపన్నులుగా చేస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక హక్కులు, సమస్యలు పరిష్కరించడంలో బిజెపి అడుగుజాడల్లో నడుస్తుందన్నారు. నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకించకుండా వాటికి రూల్స్ రూపొందించి అమలు చేయాలని ఉవ్విళ్ళూరుతుందని, రాష్ట్రంలో షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్స్ ను సవరించి ఆ సంస్థల్లో 10 గంటల పని దినం అమలుకు జీఓ ఇచ్చిందని, కార్మిక సంఘాలతో చర్చించడం లేదన్నారు. 2023లో ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఎన్నో వాగ్దానాలు చేసింది కానీ నేటికీ అమలు చేయలేదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాఖలు, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టైం స్కేల్, కంటింజెంట్, ఎన్ఎంఆర్ తదితర ఉద్యోగులను, నాన్ పర్మినెంట్, ఫిక్స్ టర్మ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ల దోపిడీ ఇకనైనా ఆపాలని, సంపన్నులకు రాయితీలు ఇవ్వటం మానేసి వారి సంపదలపై అధిక పన్నులు వేసి కార్మిక డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
భూమి, నీరు, అడవులపై ప్రజల హక్కులు పరిరక్షించాలని, వీటిని కార్పొరేట్లకు కట్టబెట్టరాదని, పై డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ఢిల్లీ రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ వరకు కదులుదామని, కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు ప్రతిఘటన కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను, పాలకులు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు.
లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనం రూ.42 వేలు, కనీస పెన్షన్ పెంపు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తింపు, ఉద్యోగ భద్రత, పర్మినెంట్, సమస్త కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీ పార్లమెంటుకు కదలి రావాలని సిఐటియు జిల్లా కమిటీ కార్మికవర్గానికి పిలుపునిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శులు సాంబారి వెంకటస్వామి, దాగం రాజారాం, జిల్లా కమిటీ సభ్యులు అంబటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.