జిల్లాలో రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
- ఖరీఫ్‌లో 4.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా
- నవంబర్ రెండో వారం నుంచి పెద్ద ఎత్తున దిగుబడులు..
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, నవంబర్ 3 (విజయ క్రాంతి): ఖరీఫ్ సీజన్‌లో(Kharif season) రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించేందుకు జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sri Harsha) తెలిపారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 4.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో 4.69 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, 26 వేల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉంటుందని వివరించారు. నవంబర్ రెండో వారం నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతులు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయించుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించనున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్లో ధరలు తగ్గినా రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాలోని 311 కొనుగోలు కేంద్రాలకు సుమారు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 1,62,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఓ శ్రీమాల, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.