రైతుల కోసం కలెక్టర్ ముందు సీపీఐ ఆందోళన
- సమగ్ర నీటి విధానాన్ని అమలు చేయాలి
- సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర నీటి విధానాన్ని అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్(CPI District Secretary Ramadugu Laxman) డిమాండ్ చేశారు. మంగళ వారం కలెక్టరేట్ ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం చేపట్టి ప్రతి ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు. జిల్లాలో వ్యవసాయానికి సాగునీటి కొరత లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జిల్లాకు 20 టీఎంసీల సాగునీరు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి పెండింగ్లో ఉన్న నీటిపారుదల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.
వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేసి రైతులను ఆదుకునేలా ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. రైతులకు పంట నష్టపరిహారం, సాగునీటి సౌకర్యం, అవసరమైన వ్యవసాయ సహాయం అందించడంతో పాటు సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ వడాల రాములుకి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, బొల్లం పూర్ణిమ, ఇప్పకాయల లింగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలిందర్ అలీ ఖాన్, కారుకూరి నగేష్, లింగం రవి, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, రేగుంట చంద్రకళ, చిప్ప నర్సయ్య, సిపిఐ మండల కార్యదర్శులు కొండు బానేష్, బొంతల లక్ష్మినారాయణ, వనం సత్యనారాయణ, మేదరి దేవావరం, అందే పురుషోత్తం, దేవి పోచన్న, కామేర దుర్గరాజ్, తిలక్ అంబేద్కర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు, మిట్టపల్లి పౌలు, మామిడి గోపి , కొట్టే కిషన్ రావు, మొగిలి లక్ష్మణ్, గుండా చంద్ర మాణిక్యం, మేకల రాజేశం,జాడి పోషం, చాడా మహేందర్ రెడ్డి, కాదండి సాంబయ్య, ఎగుడ మొండి, పార్టీ ప్రజాసంఘాల నాయకులు శ్రేణులు పాల్గొన్నారు