ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేస్తాం..

10-11-2026 | 07:02pm

మిర్యాలగూడ రైస్ మిల్లర్లు

దామరచర్ల నవంబర్ 10: ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్(Rice Millers Association) ప్రతినిధులు చెప్పారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ధాన్యం నాణ్యత బాగుంటే రూ.3,500 కంటే ఎక్కువ ధర కూడా చెల్లిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర కంటే తగ్గించి కొనుగోలు చేయబోమని హామీ ఇచ్చారు.

ధాన్యం తక్కువ ధరకు మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు నష్టం కలగకుండా ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 తగ్గకుండా కొనుగోలు చేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రైతులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

దింతో మిల్లర్లు ఎమ్మెల్యే సూచనకు అంగీకరించారు. ప్రతి రైస్ మిల్లులో రూ.3,500 తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అంగీకరించారు. రైస్ మిల్లర్లతో చర్చించి రైతులకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చొరవపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు