కార్మికుల సమస్యలపై సమరశంఖం

21-11-2026 | 06:15pm

మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ (Chalo Delhi) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాగం రాజారాం పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ సమావేశం ఎండీ కరీంబి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దాగం రాజారాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటికీ సరైన గుర్తింపు లభించడం లేదన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా మెనూ చార్జీలు (Menu Charges) పెంచడం లేదని, కోడిగుడ్ల ధరలు పెరిగినా ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న అల్పాహారం నాణ్యతపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు (Minimum Wages) చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, కోడిగుడ్లు, వంటగ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, పెన్షన్, బీమా సౌకర్యాలు కల్పించాలన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయడంతో పాటు కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ వరకు నిర్వహించే ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ రఫియా, జిల్లా కమిటీ సభ్యులు మధునమ్మ, సవిత, రమాదేవి, సరిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు