అభివృద్ధి, పారిశుద్ధ్య పనులపై ఎంఎంసి కమిషనర్ సమీక్ష

18-11-2026 | 06:23pm

ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి క్షేత్రస్థాయి పర్యటన

ఘట్‌కేసర్, నవంబర్ 18 (విజయక్రాంతి) : మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి  బుధవారం ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో అన్ని విభాగాల అధిపతులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, పలు అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.

ఘట్ కేసర్ పట్టణంలోని లింగాలకుంట వద్ద ఉన్న డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యను స్వయంగా పరిశీలించి దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు తక్షణమే సంబంధిత ఫైలును సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న టీడీఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సన్‌షైన్ పార్క్ సమీపంలోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ ను తనిఖీ చేసి, ఆప్రాంతం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే

బోగారం, కరీంగూడ ప్రాంతాల్లోని డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను త్వరగా రూపొందించి సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం రాంపల్లి చౌరస్తా సమీపంలో లేన్ మార్కింగ్ పనులను, ఇస్మాయిల్ ఖాన్‌గూడ వద్ద ఉన్న బెల్ మౌత్  ప్రాంతాన్ని కమిషనర్ తనిఖీ చేశారు. సర్కిల్ వ్యాప్తంగా ప్రమాదకరంగా, నిరుపయోగంగా వేలాడుతున్న అనవసరపు కేబుళ్లను తక్షణమే తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ఈపర్యటనలో ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి తో పాటు అన్ని విభాగాల అధికారులు, ఇంజనీర్లు,  సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు