జలమే జీవనానికి ఆధారం, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
సినీ నటులు డాక్టర్ అలీ
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జలమే జీవనానికి ఆధారం అని, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని సినీ నటులు డాక్టర్ అలీ అన్నారు. రాబోవు రోజులలో డబ్బు కోసం, ధనం కోసం కాదు, ఆస్తి కోసం కాదు గాని నీటి కోసం యుద్దాలి జరిగే రోజులు వస్తయని ఆలీ అన్నారు. జలమే జీవం, నీటిని కాపాడుకుందాం అనే నినాదంతో ఎర్త్ డే సందర్భంగా నీటి సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని శనివారం ఘట్‌కేసర్ డివిజన్ కొండాపూర్ లోని విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీనటులు డాక్టర్ అలీ పాల్గొన్నారు.
నీటి వృథాను అరికట్టడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం, భవిష్యత్ తరాల కోసం జల వనరులను పరిరక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేసి, వ్యక్తిగతంగానూ, సమష్టిగానూ నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా అలీ మాట్లాడుతూ నీటిని సంరక్షించుకోవల్సిన అవసరం ఎంతైన ఉందని, నీరు లేనిది జీవితం లేదని అన్నారు.
ఇతర దేశాలలో నీటి కోసం ఎదుర్కోంటున్న సమస్యలు తెలుసుకొని అలాంటి పరిస్థితి మన దేశంలో రాకుండా చూసుకోవలని సూచించారు. విజ్ఞాన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. అప్పారావు నాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థాగత భాగస్వామిగా సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, పాఠశాల భాగస్వామిగా తేజస్వి జూనియర్స్, స్వచ్ఛంద సంస్థల భాగస్వాములుగా విశ్వ, సొసైటీ టు సేవ్ రాక్స్, స్మరణ, స్ఫూర్తి ఆర్గనైజేషన్‌లు సహకరించగా యువత భాగస్వామ్య విభాగంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), కార్యక్రమ భాగస్వామిగా టీమ్ రెట్రో పాల్గొన్నాయి.