తహసీల్దార్, హెల్త్ ఇన్స్‌పెక్టర్ సస్పెన్షన్
- జీవించి ఉన్న వ్యక్తి పేరిట భూమి నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో పట్టా మార్పిడి
- తండ్రి పేరిట ఉన్న రెండెకరాల భూమి కొడుకు పేరుపై అక్రమ బదలాయింపు
- విజయ క్రాంతి కథనానికి స్పందన
- పూర్తిస్థాయిలో విచారణ చేయించిన జిల్లా కలెక్టర్
- అక్రమ బదలాయింపు అని తేలడంతో చర్యలు
- పట్టా మార్పిడి చేసిన తాసిల్దార్, హెల్త్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
- జాజిరెడ్డిగూడెం జూనియర్ అసిస్టెంట్ సైతం సస్పెండ్
సూర్యాపేట/ తుంగతుర్తి, నవంబర్ 25 (విజయక్రాంతి) : జిల్లాలోని తుంగతుర్తి మండలం(Tungaturthi Mandal) సూర్య నాయక్ తండాకు చెందిన లకావత్ హేమ్ల నాయక్ అనే వ్యక్తి బతికుండగానే అతని పేరిట గల భూమిని నకిలీ డెత్ సర్టిఫికెట్(Fake death certificate) ను సృష్టించి ఆయనకు చెందిన రెండెకరాల భూమిని కొడుకు పేరుపై అక్రమంగా బదలాయించడంతో బతికుండగానే నకిలీ డెత్ సర్టిఫికెట్ తో భూ పట్టా మార్పిడి పేరిట సోమవారం విజయక్రాంతి దినపత్రిక కథనంను ప్రచురించింది. దీంతో విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandlal Pawar) విచారణకు అధికారులను ఆదేశించారు.
ఈ విచారణలో అక్రమంగా పట్టా మార్పిడి చేసినట్లు నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారంలో బాధ్యులైన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి సరైన వెరిఫికేషన్ లేకుండా రెండెకరాల భూమిని బదలాయించిన తుంగతుర్తి తహసీల్దార్ టి. దయానంద్, నకిలీ డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన వెంపటి హెల్త్ ఇన్స్పెక్టర్ లకావత్ యాదగిరి లపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర వీలలో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
జాజిరెడ్డిగూడెం జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్ : ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇద్దరికీ బదులుగా తాసిల్దార్ కి తెలియకుండా డిజిటల్ కి ని ఉపయోగించి ఒకే వ్యక్తి పేరు నమోదు చేసిన జాజిరెడ్డిగూడెం తాసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఆర్ మల్లీశ్వరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అందులో ఇద్దరి పేర్లకు బదులుగా తహసీల్దార్ కు తెలియకుండా డిజిటల్ కీ ఉపయోగించి ఒక్కరి పేరు మాత్రమే సర్టిఫికెట్ లో నమోదు చేయగా చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.