మారిన తరాలు.. మారని రాతలు!
- 60 ఏండ్లుగా సవ్యంగా సాగని ప్రయాణాలు
- నరకయాతనగా మారిన 1.5 కిలోమీటర్‌ల ప్రయాణం
- బొల్లంపల్లి గ్రామస్థులకు తప్పని అష్టకష్టాలు
- ఇప్పటికైనా రోడ్డు వేయించాలని స్థానికుల వేడుకోలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్ 25: మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామ(Bollampalli village) ప్రజలకు మంచి రోడ్డు కావాలని కోరుకుంటూ 60ఏళ్లు గడిచిపోయాయి. తరాలు మారాయి.. ప్రభుత్వాలు మారాయి.. ప్రజాప్రతినిధులు మారారు... కానీ బొల్లంపల్లి రోడ్డు(Bollampalli Road) కష్టాలు మాత్రం మారలేదు. ఇది ఏదో ఒకటి రెండు సంవత్సరాల ఇబ్బందులు కాదు ఏకంగా 60 ఏండ్లుగా బొల్లంపల్లి గ్రామస్తులు పడుతున్న బాధ ఇది.
1.5 కిలోమీటర్ల ప్రయాణం నరకయాతన
తానంచర్లనకిరేకల్ జాతీయ రహదారి నుంచి మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలోకి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రహదారిపై నిత్యం ప్రజలు, రైతులు, విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, దుమ్ము,ధూళి, బురదలోనే ప్రయాణం సాగిస్తున్నారు.ఎండాకాలంలో గుంతల్లో కంకర తేలి, వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి రోడ్డు చెరువును తలపిస్తోంది.బడికి వెళ్లే విద్యార్థులు బురదలో తడుస్తూ...,వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు నానా తంటాలు పడుతూ, వృద్ధులు, మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారు.
ఆశ పడుతూ.. ఎదిరి చూస్తూ..!
ఉన్నత చదువుల కోసం ప్రతిరోజూ బొల్లంపల్లి గ్రామం నుండి విద్యార్థులు జిల్లాకేంద్రం సూర్యాపేటకు, మండల కేంద్రం అర్వపల్లికి రావాల్సిందే. కానీ సరైన రోడ్డు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం మండలంలోని వేల్పుచర్ల రోడ్డు పనులు పూర్తికావడంతో బొల్లంపల్లి ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికైనా రోడ్డు వేసి ఇబ్బందులు తొలగిస్తారు అన్న ఆశతో గ్రామస్తులు ఎదురుచూస్తూ ఉన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వెంటనే రోడ్డు వేయించి 60 ఏళ్ల కలను నెరవేర్చాలని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మించాలి
బొల్లంపల్లి గ్రామ రోడ్డు బీటి నిర్మాణానికి ప్రభుత్వం త్వరగా నిధులు మంజూరు చేయాలి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ రోడ్డు బీటీ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. వెంటనే నిధులు మంజూరు చేసి,రోడ్డు నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలి.
కేసాని రాహుల్, సామాజిక నాయకుడు బొల్లంపల్లి