ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలికాం వైర్లను తొలగించాలి

05-11-2026 | 08:17pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం డిప్యూటీ కమిషనర్ వాణి(Deputy Commissioner Vani) అధ్యక్షతన సర్కిల్ పరిధిలోని కేబుల్ ఆపరేటర్ల(Cable operators)తో పాటు ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారులు, అంతర్గత కాలనీలలో అస్తవ్యస్తంగా వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలికాం వైర్లను తొలగించడం, క్రమబద్ధీకరించడం గురించి చర్చించారు. ఈ వైర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. 

సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను తెలియజేశారు. వినియోగంలో లేని, నిరుపయోగమైన, అదనంగా వేలాడుతున్న కేబుల్ వైర్లను సంబంధిత ఆపరేటర్లు వెంటనే తొలగించాలని, వైర్ల తొలగింపునకు సంబంధిత కేబుల్ ఆపరేటర్లకు ముందస్తు సమాచారం అందించాలని, నిర్ణీత గడువులోగా వైర్లను తొలగించకపోతే, సంబంధిత ప్రాంతాల శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా నిరుపయోగమైన వైర్లను తొలగించే చర్యలు చేపడతామన్నారు.

సర్కిల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంజినీరింగ్  విభాగాల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ... ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో అనవసరంగా వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగించేందుకు కేబుల్ ఆపరేటర్లు మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు