ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
- పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
- ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పి. కిరణ్
ఘట్ కేసర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Commemoration Day) సందర్భంగా బుధవారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) ఆవరణలో అమరులైన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పి. కిరణ్(Ghatkesar Inspector P. Kiran) పాల్గొని పోలీస్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈసందర్భంగా ఇన్స్పెక్టర్ పి. కిరణ్ మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు. వారి త్యాగనిరతి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని, సమాజంలో శాంతి యుత వాతావరణం నెలకొల్పేందుకు అహర్నిశలు శ్రమించే పోలీసు సిబ్బంది అంకితభావాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా నిబద్ధతతో సేవలు అందిస్తాం అని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో సబ్-ఇన్స్పెక్టర్లు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఇతర సిబ్బంది పాల్గొని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.