నకిలీ జీపీఏలతో స్థలాల విక్రయం

07-10-2026 | 06:05pm

- కీసరలో ఐదుగురు అరెస్ట్

మేడ్చల్, అక్టోబర్ 07 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో నకిలీ జీపీఏలతో రూ.కోట్ల విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠా గుట్టును కీసర పోలీసులు(Kesara Police) రట్టు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి తెలిపారు. కీసర పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి తోటరెడ్డి వెంకట్ రెడ్డి (78) చీర్యాలలో సర్వే నెం.94లో 18 ఎకరాల 19 గుంటల భూమిని 1982లో కొనుగోలు చేశారు. 2024 జులైలో స్థలానికి వెళ్లగా ఫెన్సింగ్ వేస్తుండటం చూసి ఆరా తీయగా, తన భూమి వేరే వాళ్ల పేరున రిజిస్ట్రేషన్ అయినట్లు తేలింది. దీంతో ఆయన కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో సయ్యద్ అఫ్జల్ అనే వ్యక్తి 1988లోనే వెంకట్ రెడ్డి, మహమ్మద్ ఇక్బాల్ పేర్లతో మారేడ్‌పల్లి SROలో నకిలీ GPA సృష్టించినట్లు బయటపడింది. అందులో ఫోటోలు, సంతకాలు, వేలిముద్రలు అన్నీ ఫోర్జరీ చేశారు. బుధవారం ప్రధాన నిందితుడు బసరికారి శ్రీనివాస్ రావు తో పాటు బార్లపాటి ఆనంద్, బొర్రా వెంకటేష్, మిర్ సాదిక్ అలీ, రామిడి సత్తి రెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరు నకిలీ GPA ఆధారంగా సర్వే నెం.94 లోని ప్లాట్ నెం.21, 28, 38, 59, 129, 145లను సేల్ డీడ్ లు, అగ్రిమెంట్ కం GPA లుగా అమ్మకం చేశారు.

నకిలీ అని తెలిసీ మిగతా నలుగురు సాక్షి సంతకాలు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఈ దందాలో మధ్యవర్తులుగా తటాకం నారాయణ శర్మ, జూపల్లి రవీందర్ వ్యవహరించారని, వారి కోసం గాలింపు చేస్తున్నామని ఏ సి పీ తెలిపారు. నిందితులపై BNS 318(4), 336(3), 338, 319(2), 340(2) కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. జవహర్ నగర్ ఏసిపి ఎస్.చక్రపాణి పర్యవేక్షణలో కీసర ఇన్‌స్పెక్టర్ బిక్కి రమేష్, SI అనిల్ కుమార్ ఈ కేసును ఛేదించారు.

మరిన్ని వార్తలు