బాచుపల్లిలో అక్రమ నిర్మాణాల జోరు
సిఎంసీ ఆదేశాలు ఉన్నప్పటికీ... మొద్దు నిద్రలో టౌన్ ప్లానింగ్ అధికారులు
అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి..?
నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ తీరుపై పలు సందేహాలు
కుత్బుల్లాపూర్,అక్టోబర్ 07(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్(Nizampet Circle) పరిధి బాచుపల్లిలోని మాకెవ్వడు అడ్డు అనేలా విర్రవీగుతూ రెచ్చిపోతున్నారు కొందరు భవన నిర్మాణదారులు. భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతులకు పొంతన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అదనపు అంతస్తులు వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి కే ఆర్ సీ ఆర్ హరితవనం కాలనీలో ఓ నిర్మాణదారుడు జీ+2 అనుమతులు తీసుకుని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా అదనంగా జీ+4 భవనాన్ని నిర్మిస్తున్నాడు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం పై అధికారులు చర్యలు లేకపోవడం ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కనీసం సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం పట్ల స్థానికుల నుండి పలు ప్రశ్నలు వెలువడుతున్నాయి. భవిష్యత్తులో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించి ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరిది... నష్టం ఎవరికని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
సిఎంసీ ఆదేశాలు ఉన్నప్పటికీ... మొద్దు నిద్రలో సర్కిల్ టౌన్ ప్లానింగ్
సదరు అక్రమ నిర్మాణంపై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నప్పటికి నోటీసులతోనే కాలం గడుపుతున్నారు. సీఎంసీ కమిషనర్ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికి టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడంపై పలు సందేశాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం అధికారుల కనుసన్నాల్లోనే జరుగుతుందని అధికారులకు, నిర్మాణదారుడికి చీకటి ఒప్పందం అయినందుకే అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
పైగా నిర్మాణదారుడు అధికారులు నన్నేమి చేయలేరు అనే ధీమా వ్యక్తం చేస్తూ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇలా చెప్పుకుంటూ పోతే సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు మరెన్నో అయినా అధికారుల తీరు మారదంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇకనైనా టౌన్ ప్లానింగ్ అధికారులు మొద్దు నిద్ర వీడి సదరు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.