ప్రజలకు నరకప్రాయంగా మీసేవ కేంద్రం!

10-11-2026 | 05:47pm

మూడు గుళ్ల సమీపంలోని మీసేవలో కనీస వసతులు కరువు

మరుగుదొడ్డికి తాళం.. గుంతలమయంగా మారిన నేల

సమాచారం అందించడంలోనూ సిబ్బంది నిర్లక్ష్యం.. 

ప్రజల ఆగ్రహం

మల్కాజిగిరి, నవంబర్,10 విజయక్రాంతి: ప్రభుత్వ సేవలను(Government services) ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు(Meeseva Centers) ప్రజలకు నమ్మకాన్ని కల్పించాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్కాజిగిరిలోని మూడు గుళ్ల సమీపంలో ఉన్న మీసేవ కేంద్రం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ సేవల కోసం నిత్యం ఎంతోమంది ప్రజలు ఈ కేంద్రానికి వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీసేవ కేంద్రానికి వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారం అందించడంలోనూ సిబ్బంది సరైన విధంగా స్పందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పని కోసం ఎక్కడ సంప్రదించాలి, ఏయే పత్రాలు తీసుకురావాలి అనే విషయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ ధ్రువపత్రాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవల కోసం వచ్చే వారు సరైన మార్గదర్శకత్వం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.

మరుగుదొడ్డికి తాళం.. ప్రజలకు అవస్థలు!


మీసేవ కేంద్రంలో అత్యంత కనీస అవసరమైన మరుగుదొడ్డి సౌకర్యం కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అత్యవసరంగా బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా తాళం వేసి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలు, వృద్ధులు, ఇతర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ, ఈ విషయంలో నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

కుంగిపోయిన బండరాళ్లు.. ప్రమాదకరంగా నేల!

మీసేవ కేంద్రం లోపల నేలపై ఏర్పాటు చేసిన బండరాళ్లు కుంగిపోయి, అస్తవ్యస్తంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కార్యాలయంలోకి అడుగుపెట్టే సమయంలోనే అసౌకర్యం కలుగుతోందని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తడబడే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతంలో కనీస మరమ్మతులు చేపట్టకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేయాలని, ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, మరుగుదొడ్డిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కుంగిపోయిన బండరాళ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సంఘసేవకుడు, సోషల్ వర్కర్ షేర్ల అనిల్ కోరుతున్నారు

మరిన్ని వార్తలు