కోర్టును ఏటూరునాగారంలోనే నిర్మించాలి..

10-11-2026 | 05:49pm

తుడుందెబ్బ మండల అధ్యక్షుడు పూనెం శ్రీకాంత్..

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు మంజూరు చేసిన కోర్టు  భవనాన్ని(Mulugu Court Building) షెడ్యూల్డ్  ఏరియాలోనే ఆదివాసి ప్రజలకు, అలాగే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ అందుబాటులో ఉండే  విధంగా ఏటూరు నాగారంలోనే నిర్మించాలని, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ వెంకటాపురం  మండల అధ్యక్షుడు పూనెం శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని రహదారులు భవనాలు అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఏటూరు నాగారంలో కోర్టు నిర్మాణం చేపట్టినట్లయితే కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, మండలాల ప్రజలకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోనే కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు న్యాయ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రయాణ ఖర్చులు, ఆర్థిక భారం తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

పేదలు, వృద్ధులు, మహిళలు, గిరిజన ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏటూరు నాగారంలోనే కోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంలోని పెద్దలు గిరిజన ప్రాంతాల ప్రజల ఆర్థిక  పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఈ ప్రాంత మంత్రి చొరవ చూపాలని, కోర్టును ఏటూరు నాగారంలో నిర్మించాలనినిర్మించే  కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల ఉపాధ్యక్షులు రేగ నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మిచ్చ సురేష్, ఆదివాసి విద్యార్థి సంఘం మండల ప్రధాన కార్యదర్శి పాయం శశి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్షిక అనిల్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు