గీతంలో రఫ్ సెట్ సిద్ధాంతంపై కార్యశాల
ఏఐ, డేటా సైన్స్‌లో అనిశ్చితి నివారణపై నిపుణుల సూచనలు
పటాన్ చెరు, నవంబర్ 10 : కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) (ఏఐ), డేటా సైన్స్(Data Science) రంగాల్లో అనిశ్చితిని పరిష్కరించి, మెరుగైన డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ సైన్స్(GITAM School of Science) ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు కార్యశాల నిర్వహించారు. రఫ్ సెట్ సిద్ధాంత వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ జిడ్జిస్లావ్ పావ్లాక్ జన్మ శతాబ్ది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు రఫ్ సెట్ సిద్ధాంతం ప్రాముఖ్యత, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో దాని అనువర్తనాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డేటా విశ్లేషణ, ఫీచర్ సెలక్షన్, నాలెడ్జ్ డిస్కవరీ, తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సిద్ధాంతం ఉపయోగాలను వివరించారు.
కార్యశాలలో వివిధ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, పీజీ విద్యార్థులు పాల్గొని నిపుణులతో చర్చించారు. ఈ కార్యక్రమానికి గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రెజా అధ్యక్షత వహించగా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జాదవ్ గణేష్ నిర్వహించారు. డాక్టర్ డి. మల్లికార్జున రెడ్డి, డాక్టర్ నాయర్ రమ్య రవీంద్రన్ సమన్వయం చేశారు.