రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. డ్రైవర్ అరెస్ట్
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు.. కారు సీజ్
మేడిపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, ప్రమాదానికి ఉపయోగించిన కారును సీజ్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 16న సాయంత్రం సుమారు 3:10 గంటల సమయంలో బోడుప్పల్‌కు చెందిన ఓం ప్రకాష్ (40) తన యాక్టివా స్కూటీ (నంబర్ జిజె 06 ఎం ఎన్7002)పై చెంగిచెర్ల నుంచి రాంపల్లి వైపు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓం ప్రకాష్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టావని, ప్రమాద స్థల పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని(CCTV camera footage) పరిశీలించి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. విచారణలో కారు డ్రైవర్ భూక్యా నవీన్ (31)గా గుర్తించి శనివారం అరెస్ట్ చేసి, ప్రమాదానికి ఉపయోగించిన టీఎస్24 జి2369 నంబరు గల కారును సీజ్ చేసామని మేడిపల్లి సిఐ డి.జలంధర్ రెడ్డి తెలిపారు.