‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ
సింపుల్ స్టోరీ.. స్ట్రాంగ్ ఎమోషన్స్.. ‘ఆకాశంలో ఒక తార’ ఎలా ఉందంటే?
టాలీవుడ్లో కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘పెళ్లిచూపులు’, ‘జెర్సీ’, ‘బ్రోచేవారెవరురా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాయి. అలాంటి మంచి అనుభూతిని మళ్లీ గుర్తు చేసే సినిమాల జాబితాలోకి దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చేరిందనే అభిప్రాయం కలుగుతుంది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటించగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?
కథేంటి?
కల్పన (సాత్విక వీరవల్లి) ఓ గ్రామానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే Astronaut కావాలనే పెద్ద కల కంటుంది. కానీ ఆమె తండ్రికి ఆడపిల్ల చదువుపై ఆసక్తి ఉండదు. దీంతో కేవలం 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసేస్తాడు. కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో వివాహమైన తర్వాత కూడా కల్పన తన లక్ష్యాన్ని మర్చిపోదు. మొదట ఆమె కలను చిన్ననాటి సరదాగా భావించిన కృష్ణ.. అది ఆమె జీవితాశయమని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెకు అడ్డుగా నిలవకుండా, తనవంతుగా సహకరించాలని నిర్ణయించుకుంటాడు. ఒక అమ్మాయి కలలు, వివాహ బంధం, కుటుంబ బాధ్యతలు, ప్రేమ.. వీటి చుట్టూ ఈ కథ సాగుతుంది.
హీరోయిజం అంటే అడ్డుకోవడం కాదు.. అండగా నిలవడం!
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం కృష్ణ పాత్ర చిత్రణ. సాధారణంగా భార్య కలను భర్త నెరవేర్చే కథల్లో హీరోను గొప్పగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా జరగదు. ‘నేనేమీ చేయలేదు.. ఆమెను ఆపలేదు అంతే. దానికి ప్రశంసలు ఎందుకు?’ అనే భావనతో సాగే సన్నివేశం సినిమాకు అసలైన బలంగా నిలుస్తుంది. ఒక వ్యక్తి కలను గౌరవించడం కూడా ప్రేమలో భాగమేననే విషయాన్ని దర్శకుడు చాలా సున్నితంగా చూపించారు. కృష్ణకు, అతడి సోదరికి మధ్య వచ్చే సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో రోహిణి (శ్రుతి హాసన్), కృష్ణ మధ్య వచ్చే సీన్ భావోద్వేగానికి గురిచేస్తుంది. తనలాంటి డ్రైవర్ ఒక Scientistను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కృష్ణ చెప్పే విధానం హృదయాన్ని తాకుతుంది. ఎక్కడా బలవంతంగా ఎమోషన్స్ పండించకుండా, పాత్రల స్వభావం నుంచే సహజమైన భావోద్వేగాలను తీసుకురావడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం.
దుల్కర్ నటన.. మరోసారి మ్యాజిక్!
దుల్కర్ సల్మాన్ తనదైన నటనతో కృష్ణ పాత్రకు ప్రాణం పోశారు. ఎక్కడా అతిగా నటించకుండా, సింపుల్‌గా పాత్రలో ఒదిగిపోయారు. సీతారామం, లక్కీ భాస్కర్ తర్వాత మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాత్రలోని నిశ్శబ్దమైన ప్రేమ, బాధ్యత, భావోద్వేగాలను చాలా పరిణతితో పలికించారు. హీరోయిజం కోసం ప్రత్యేకంగా సన్నివేశాలను సృష్టించకుండా కథకు తగ్గట్టుగా నటించడం ఆయన ప్రత్యేకత.
హీరోయిన్గా పరిచయమైన సాత్విక వీరవల్లి మంచి నటన కనబరిచారు. పాఠశాల విద్యార్థిని నుంచి పెళ్లైన మహిళగా మారే క్రమంలో కల్పన పాత్రలోని మార్పులను సహజంగా చూపించారు. అమాయకత్వం, పట్టుదల, బలహీనతలను చక్కగా పలికించారు. ముఖ్యంగా తండ్రితో ఆమెకు సంబంధించిన ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. రోహిణి పాత్రలో శ్రుతి హాసన్ తక్కువ నిడివిలోనే తనదైన ముద్ర వేశారు. రుహాని శర్మ కూడా తన పాత్ర పరిధిలో మెప్పించారు.
టెక్నికల్ టీమ్ ఎలా పనిచేసింది?
సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అందంగా తెరపై ఆవిష్కరించింది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన Music, Background Score భావోద్వేగ సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. గున్నం గంగరాజు సంభాషణలు సహజంగా ఉండి కథకు మంచి బలంగా నిలిచాయి. ముఖ్యంగా రెండో భాగంలో Spaceకు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. కొన్ని Visual Effects అంతగా ఆకట్టుకోకపోయినా సినిమా అనుభూతికి పెద్దగా అడ్డంకిగా మారవు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ ఏంటి?
సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా Dubbing విషయంలో కొన్ని సన్నివేశాల్లో నటీనటుల Lip Sync సరిగ్గా కుదరలేదు. దీంతో భావోద్వేగ సన్నివేశాల్లో ప్రేక్షకులు కథ నుంచి కొంత బయటకు వచ్చే అవకాశం ఉంది. రెండో భాగంలో Editing ఇంకాస్త బాగుండాల్సింది. కొన్ని సన్నివేశాలు క్లైమాక్స్‌లా అనిపించినా, కథ ముగిసిందనుకునే సమయంలో మరో 10 నుంచి 20 నిమిషాల కథ మిగిలి ఉండటం కొంత సాగదీసిన భావన కలిగిస్తుంది.
ఫైనల్‌గా..
‘ఆకాశంలో ఒక తార’ పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు. కానీ మంచి కథ, సహజమైన భావోద్వేగాలు, బలమైన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకరి కలను మరొకరు గౌరవించడం, ప్రేమించిన వ్యక్తికి స్వేచ్ఛనివ్వడం, జీవితంలో అండగా నిలవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా గుర్తుచేస్తుంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూడాలనిపించే Feel-Good మూవీ ఇది. లోపాలను పక్కనపెడితే, మనసుకు మంచి అనుభూతిని ఇచ్చే సినిమాగా ‘ఆకాశంలో ఒక తార’ నిలుస్తుంది. డ్రీమ్స్‌కు రెక్కలు.. బంధాలకు కొత్త అర్థం.. దుల్కర్ మ్యాజిక్! 'ఆకాశంలో ఒక తార' రేటింగ్ 3.5/5.